రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం వానలు దంచికొట్టాయి. ప్రధానంగా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 69.8 మిల్ల్లీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో 62 మిల్ల్లీమీటర్ల వర్షపాతంనమోదు అవ్వగా, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 48.8, యాదాద్రి భువనగిరి జిల్లా యెల్లంకిలో 46.8, నారాయణపేట్ జిల్లా కృష్ణలో 44.8, సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో 42.8, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 41.3, సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో 40.5, జయశంకర్ జిల్లా శార్వాయిపేటలో 39.5, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 39.5 మిల్ల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని తెలిపింది.
గ్రేటర్లో శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యూసు్‌ఫగూడ, కృష్ణానగర్, వెంగళ్రావునగర్, బేగంపేట, ఎంఎ్సమక్తా, ఫిలింనగర్ లోతట్టు ప్రాంతాల్లో రహదారులను వర్షంనీరు ముంచేసింది. ఖైరతాబాద్‌లో చెట్టు కొమ్మ విరిగి పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై మోకాలి లోతున నీరు నిలిచిపోవడంతో సికింద్రాబాద్, మాదాపూర్, కొండాపూర్, జేఎనటీయూ, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీవర్షంతో రాజేంద్రనగర్, బోరబండ, చార్మినార్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వరదనీరు నిలిచిపోకుండా విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.