ఆదిపురుష్ సినిమా విడుదల సందర్భంగా పలు థియేటర్లలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ హంగామా సృష్టించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న భ్రమరాంబ థియేటర్‌లో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్లో కూర్చున్నందుకు ఒక వ్యక్తిని కొంతమంది కలిసి చితక్కొట్టారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఉదయం సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ఓ వ్యక్తి.. హనుమంతుడి కోసం ఉంచిన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో కొంతమంది అతడిపై దాడికి పాల్పడ్డారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్లు సిబ్బంది గొడవ సద్దుమణిగేలా చేశారు. హనుమంతుడి సీట్లో కూర్చున్న వ్యక్తిని మరో సీట్లోకి పంపించారు. సదరు వ్యక్తి మద్యం సేవించినట్లు చెబుతున్నారు. మద్యం మత్తులో తెలియక హనుమంతుడి సీట్లో కూర్చున్నట్లు తెలుస్తోంది. అటు షోను టైమ్‌కు ప్రదర్శించలేదనే కారణంతో సంగారెడ్డి జిల్లాలోని ఒక థియేటర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హల్‌చల్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం పరిధిలో ఉన్న జ్యోతి థియేటర్‌లో ‘ఆదిపురుష్’ సినిమాను ఆలస్యంగా ప్రదర్శించారు. దీంతో పాటు సౌండ్ సిస్టం సరిగా లేదంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో థియేటర్ అద్దాలను పగలగొట్టి వీరంగం సృష్టించారు. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు.
ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో హనుమంతుడి కోసం సినిమా యూనిట్ ఒక సీటును కేటాయించింది. ఈ సీట్లపై కొన్ని థియేటర్లలో హనుమంతుడి ఫొటో పెట్టి పూజలు చేస్తున్నారు. మరికొన్ని థియేటర్లలో సీటుపై కాషాయ వస్త్రం ఉంచి పూలు పెడుతున్నారు.