బీపీఎల్ కార్డుదారులకు జూలై ఒకటి నుంచే 10 కిలోల ఉచిత బియ్యం(10 kg free rice) పంపిణీ చేస్తామని, ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తేల్చి చెప్పారు. మైసూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం శనివారం మీడియాతో మాట్లాడుతూ జూలై ప్రారంభం నుంచి బీపీఎల్ కార్డుదారులకు 10 కిలోల బియ్యం పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. మైసూరులోనే అన్నభాగ్య పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నైరుతి రుతుపవనాలు జాప్యమవుతున్నందున రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి సమస్య లేకుండా చూసేలా జిల్లా అధికారులను ఆదేశించామన్నారు.
జిల్లా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. గృహలక్ష్మి గ్యారెంటీకి మరో ఐదు రోజుల్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోను వాయిదాలు ఉండవన్నారు. దరఖాస్తు రూపొందించే ప్రక్రియ సాగుతోందన్నారు. ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని, ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. ప్రాంతానికో పథకాన్ని ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. బెంగళూరులో ఆదివారం శక్తి గ్యారెంటీ ప్రారంభిస్తామని, అన్నభాగ్య గ్యారెంటీ మైసూరు(Mysore) నుంచి శ్రీకారం చుడతామని, బెళగావి నుంచి గృహలక్ష్మి గ్యారెంటీని ప్రారంభిస్తామన్నారు. ఇదే సందర్భంలోనే వరుణ పట్టణాన్ని తాలూకా కేంద్రంగా మార్చాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజల డిమాండ్‌ను బట్టి వరుణను తాలూకా కేంద్రం చేస్తామన్నారు. తాలూకా కేంద్రం ఏర్పడితే ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని ప్రజలు ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం సొంత నియెజకవర్గం వరుణలో అభిమానులు సమావేశంలో పాల్గొన్నారు.