నేటి నుంచే ఫార్ములా ఈ – రేస్
హైదరాబాద్: సాగరతీరంలో ఈ కార్లు.. రయ్రయ్ మంటూ దూసుకుపోనున్నాయి. ఫార్ములా ఈ – రేస్ శనివారం ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఈ రేసుకి సంబంధించి ఎనిమిది సీజన్లు ముగియగా.. తొమ్మిదో సీజన్లో నాలుగో రేసు ఈరోజు నుంచి హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో జరగనుంది. ఈ రేసులో 11 జట్లు పోటీపడుతుండగా మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇండియా నుంచి మహీంద్రా రేసింగ్ బరిలో ఉంది. అలానే టాటా, టీసీఎస్ టీమ్స్ కూడా పోటీపడుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో రేసు కోసం ‘హైదరాబాద్ స్ట్రీ సర్క్యూట్’ని రెడీ చేశారు. ఈ సర్క్యూట్ పొడవు 2.8 కిమీ పొడవుకాగా.. 18 మలుపుల్ని ఏర్పాటు చేశారు. రేసుని దాదాపు 20 వేల మంది ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా గ్యాలరీను సిద్ధం చేశారు. ఈరోజు ఉదయం క్వాలిఫయింగ్ రేసు జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి మెయిన్ రేసు స్టార్ట్‌కానుంది. ఫార్ములా-ఈకి ఆతిథ్యమిస్తున్న 30వ నగరం హైదరాబాద్.
మెయిన్ రేసు దాదాపు గంటన్నరపాటు జరగనుండగా.. ఈ-రేసు వీక్షించేందుకు ఈరోజు సెలెబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఫ్రీ ప్రాక్టీస్ రేసు జరిగింది. ఆ రేసుని వీక్షించేందుకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి, మహేష్ బాబు భార్య నమ్రత వచ్చారు. ఫ్రీ ప్రాక్టీస్ రేసు టైమ్‌లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. 18వ మలుపు వద్ద ఫోర్షే డ్రైవర్ ట్రాక్ పక్కన ఉన్న గోడని వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. అయితే డ్రైవర్‌కి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది.