సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు చాలా మితంగా మాట్లాడుతుంటారు. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో సినిమాలు చేశారు ఆదిశేషగిరిరావు. పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు తమ్ముడికే అప్పగించారు కృష్ణ. ఇదే బ్యానర్‌పై అన్నయ్య కృష్ణతో ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే బ్లాక్ బస్టర్ మూవీని ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నట్టు ఆదిశేషగిరిరావు వెల్లడించారు.
అయితే, జయంతి దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదిశేషగిరిరావు పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఫిల్మ్ ట్రీ యూట్యూబ్ ఛానెల్‌కు ఆదిశేషగిరిరావు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడానని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందిన రోజు ఆయన పార్థివదేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు ఎందుకు తీసుకెళ్లలేదని ఇంటర్వ్యూలో భాగంగా ఆదిశేషగిరిరావును యాంకర్ ప్రశ్నించారు. గచ్చిబౌలి స్టేడియంలో అప్పుడు మంచు ఎక్కువగా పడుతుండటం.. ఆ మంచులో బయట కృష్ణ పార్థివదేహాన్ని ఉంచడం ఇష్టం లేక తీసుకెళ్లలేదని ఆదిశేషగిరిరావు వివరణ ఇచ్చారు. అయితే, నానక్‌రాంగూడాలో ఆరోజు రాత్రి కృష్ణ పార్థివదేహం వద్ద ఎవ్వరూ లేరని, అనాథలా వదిలేశారని ఒక వీడియో వైరల్ అయ్యిందని.. దానిపై మీరేమంటారని యాంకర్ అడిగారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ఒంటరిగా ఎందుకు వదిలేస్తామని.. తన కొడుకు, మేనల్లుడు రాత్రంతా అక్కడే ఉన్నారని చెప్పారు. మహేష్ బాబు లేనంత మాత్రాన ఎవ్వరూ లేనట్టేనా అని ప్రశ్నించారు.