పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇద్దరు చిన్నారులు ఫిర్యాదు
తమ ఎదుటే తల్లిని తండ్రి కొట్టడంతో కలత చెందిన ఇద్దరు చిన్నారులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేశారు. అమ్మను నాన్న కొడుతున్నారని, అరెస్ట్ చేయండి అంటూ పోలీసులను ఆ బాలికలు ఇద్దరూ కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా భిటర్వార్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్‌లో పోలీసులు తమ రోజువారీ పనిలో నిమగ్నమై ఉండగా.. ఇద్దరు చిన్నారులు లోపలికి వచ్చారు. చిన్న పిల్లలు అందులోనూ వారి వెంట ఎవరూ రాకపోవడంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇరువురు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్న స్టేషన్ ఇంఛార్జ్ ప్రదీప్ శర్మ.. వారిని కూర్చోబెట్టి ఆరా తీశారు. ‘మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు.. సమస్య ఏంటో చెప్పండి’’ అని ప్రదీప్ శర్మ అడిగారు. దీంతో పిల్లలు ‘మా అమ్మను నాన్న కొడుతున్నాడని, ఆయన్ను అరెస్ట్ చేసి అమ్మను కాపాడండి’ అని చెప్పడంతో ఆయన షాకయ్యారు. వారు చెప్పిందంతా విన్న అనంతరం.. పిల్లలను తీసుకుని నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లారు. బాలికల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. పిల్లల ముందు గొడవపడితే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
‘భార్యభర్తలు గొడవ పడుతూ ఉంటే, పిల్లల ప్రవర్తన ప్రభావితమవుతుందని ఇరువురికీ బుద్ధులు చెప్పారు. అలాగే, భార్యను కొడుతోన్న సదరు భర్తకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రదీప్ శర్మ మాట్లాడుతూ.. ‘మైనర్ బాలికలు తమ తల్లిని తండ్రి కొడుతున్నారని ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. మేము వారి చెప్పిన వాటిని విన్నాం.. ఆ తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల తల్లిదండ్రులను కలిశాం.. పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున గొడవలు పెట్టుకోవద్దని మేం వారికి సూచించాం’ అని వివరించారు.