AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ

ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీల నిర్ణయం.. ఎటూ తేల్చని బీఆర్‌ఎస్‌
కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై రగడ కొనసాగుతోంది. ఈనెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధాని కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధాని కేవలం ప్రభుత్వానికి మాత్రమే నేతృతం వహిస్తారని, రాష్ట్రపతి మాత్ర శాసన వ్యవస్థకు నేతృత్వం వహిస్తారని అంటున్నాయి విపక్షాలు. అందుకే రాష్ట్రపతి చేతుల మీదుగా కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని 19 విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వాటిలో కాంగ్రెస్‌, లెఫ్ట్, జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఉన్నాయి.

అయితే, కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుపై బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ తో టచ్‌లో ఉన్న మిత్రపక్షాలన్నీ ఇప్పటికే బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకో నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న BRS.. పార్లమెంట్ ప్రారంభోత్సవంపై తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే.. వేచిచూడాల్సిందే..

పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా.. ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని , విపక్షాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని అమిత్‌షా కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10