ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పలువురు విద్యార్థులు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. మనస్థాపం చెందిన కొందరు స్టూడెంట్స్ మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిన్న ఒక్కరోజే తెలంగాణలో నలుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దంటూ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేసినా.. ఫలితం లేకుండా పోయింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.., మార్కులు తక్కువగా వచ్చాయని.. ఆత్మనూన్యతాభావానికి లోనై ఎంతో విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముంగిచేస్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలపై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మార్కులే జీవితం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కష్టాలకు ఎదురొడ్డి నిలిస్తేనే.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతామనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు.