పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియట్లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్కూ కూడా శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అని అధికారులు ఆలోచిస్తున్నారు. వీటికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తున్నారు.