కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 5.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.
ముందస్తు ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌దే విజయమని చెబుతున్నాయి. గత 40 రోజులుగా హోరెత్తిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 72.36 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకుమించి నమోదయ్యేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇంకోవైపు.. పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించాయి. పలు చిన్న పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ మొత్తం 224 స్థానాలకు, కాంగ్రెస్ 223, జేడీఎస్ 207 చోట్ల అభ్యర్థులను నిలిపాయి. 1985 నుంచి 38 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు.
ఈ ఆనవాయితీని బద్దలు కొట్టి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భారీఎత్తున ప్రచారం నిర్వహించింది. అటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని హోరెత్తించింది. ఇక రాష్ట్రంలో హంగ్ సభ ఖాయమని.. 35-40 స్థానాలు సాధించి మళ్లీ ‘కింగ్‌మేకర్’ అవ్వాలని జేడీఎస్ తహతహలాడుతోంది. కాగా, కర్ణాటక శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.379.36 కోట్ల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.