AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభివృద్ధికి చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నాం : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ మ‌హానగ‌రం అభివృద్ధి కోసం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. బేగంపేట‌లోని ధ‌నియాల‌గుట్ట‌లో అధునాత‌న సౌక‌ర్యాల‌తో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. ఈ నిర్మాణాన్ని ఎంతో మంది ఆపే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఇంత చ‌క్క‌టి వైకుంఠ‌ధామాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లో మ‌హా ప్ర‌స్థానం అని క‌ట్టారు. దాని కంటే ఇది అద్భుతంగా ఉంద‌ని గ‌ర్వంగా చెప్పొచ్చు అని కేటీఆర్ అన్నారు. న‌గ‌రం విశ్వ‌న‌గ‌రంగా ఎద‌గాలంటే అద్భుత‌మైన ఫ్లై ఓవ‌ర్లు, ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ ఉండాలి.

దాంతో పాటు 24 గంట‌ల క‌రెంట్ ఉండాలి. మంచినీటి స‌ర‌ఫ‌రా ఉండాల్సిందే. చెరువులు, నాలాలు బాగు చేసుకోవాలి. ఈ 9 ఏండ్ల‌లో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం మ‌నంద‌రం గ‌ర్వ‌ప‌డే విధంగా త‌యారైందా..? లేదా..? అనే విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించాలి అని కేటీఆర్ సూచించారు. హైద‌రాబాద్ లో అన్ని నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను బాగు చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు. ల‌క్ష డుబ‌ల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టాం, ఈ నాలుగు నెల‌ల్లోనే అందిస్తాం అన్నారు. ద‌శ‌బ్దాలుగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకున్నాం అన్నారు. కులం, మ‌తం అనే తేడా లేకుండా ముందుకు వెళ్తున్నాం అన్నారు.

ఎయిర్‌పోర్టు దాకా మెట్రో వేసుకుంటున్నాం, ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని అంద‌రూ గ‌మ‌నించాల‌న్నారు. మాట‌లు తిట్ట‌డం ఈజీ.. మాకు కూడా తిట్లు వ‌స్తాయి.. కానీ ప్ర‌జ‌ల‌కు ఏం చేశామ‌నేది ముఖ్యం అన్నారు. బీజేపీ నాయ‌కులు ఒక రూపాయి కూడా సాయం చేయ‌లేదు.. హైద‌రాబాద్ వ‌ర‌ద బాధితుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం రూ.660 కోట్ల సాయం చేసింద‌న్నారు. ఇవాళ కేసీఆర్ ప్ర‌భుత్వం మీ కోసం చిత్త‌శుద్ధితో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని బాగు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయి. అందుకు కార‌ణం రాజ‌కీయ స్థిర‌త్వ‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10