AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాక్ మంత్రికి షాక్..! షాంఘై సదస్సుకే పరిమితం..! వాటిలోకి నో ఎంట్రీ..

షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. ఢిల్లీలోని పురానా ఖిలా వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న సదస్సు కోసం ఆయన భారత్ లో అడుగుపెట్టారు. అయితే ఈ పర్యటనలో భాగంగా భారత్ లోని ప్రముఖ ప్రదేశాలని సందర్శించాలని ముసాదిక్ భావించారు. కానీ కేంద్రం అందుకు ససేమీరా అనడంతో పాటు ఆయన రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

ఆగ్రాలోని తాజ్‌మహల్‌తో పాటు ఢిల్లీలోని ప్రఖ్యాత నిజాముద్దీన్ దర్గాను సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ముసాదిక్ మాలిక్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అయితే షాంఘై సమావేశాలు మినహా మరే ఇతర ప్రాంతాలను సందర్శించేందుకు ఆయనకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజాముద్దీన్ దర్గా సందర్శనకు ఇప్పటికే అనుమతి నిరాకరించగా.. తాజ్‌మహల్ సందర్శనపై మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నట్లు సమాచారం. భద్రతాపరమైన కారణాల రిత్యా అక్కడికి ఆయన్ను అనుమతించకపోవచ్చని అధికార వర్గాలు లీకులు ఇస్తున్నాయి.

2023లో గోవాలో జరిగిన షాంఘై సదస్సుకు పాక్ విదేశాంగ మంత్రి హాజరుగా.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ దేశ మంత్రి భారత్ లో అడుగుపెట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ నేత ఒకరు భారత్ కు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎస్‌సీఓ వేదికగా ప్రజల మధ్య సంబంధాలను, నాగరికతల మధ్య సంవాదాన్ని ప్రోత్సహించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పాకిస్థాన్ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు పాకిస్థాన్ మంత్రిని భారత్ కు ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సమయంలో ముసాదిక్ మాలిక్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాయి. అటువంటి వ్యక్తిని భారత్ కు ఆహ్వానించి.. ఆతిథ్యం ఇవ్వడం ఏమాత్రం సరైంది కాదని మండిపడుతున్నాయి. కాగా 2024 అక్టోబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్‌సీఓ దేశాధినేతల మండలి సమావేశానికి ప్రధాని తరఫున భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకావడం గమనార్హం.

ANN TOP 10