AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ నా కథలో రావణాసురుడు..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై, ఆయన కుమారుడు కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను తన కథలో ‘రావణాసురుడు’గా అభివర్ణించిన రేవంత్, కేటీఆర్‌ను ‘మేనేజ్‌మెంట్ కోటా’ నాయకుడంటూ కొట్టిపారేశారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి కేసీఆరేనని, కేటీఆర్‌ను తాను అంత సీరియస్‌గా పరిగణించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. “కేటీఆర్ ఒక మేనేజ్‌మెంట్ కోటా నాయకుడు. తండ్రి అండతోనే ఆయన లీడర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ కాబట్టి, ఆయన్నే నేను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తాను” అని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఆ పార్టీని ఎప్పుడో ఖతం చేసేదని, కానీ ప్రతిపక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే దాన్ని కొనసాగనిస్తున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఎలాంటి ముఖ్య పాత్ర లేదని, కాంగ్రెస్‌కు బీఆర్ఎస్సే ప్రధాన శత్రువని ఆయన పేర్కొన్నారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ‘ఓట్ల దొంగతనానికి’ పాల్పడుతోందని ఆరోపించారు.

ఇదే కార్యక్రమంలో, గతంలో ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, త్వరలో క్రిస్టియానో రొనాల్డోను తెలంగాణకు ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ అప్పులు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, లోక్‌సభ సీట్ల పునర్విభజన వంటి అంశాలను ప్రస్తావిస్తూనే, రాష్ట్రంలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ గురించి కూడా మాట్లాడారు

ANN TOP 10