భూమి కొలతల్లో చిన్న తేడా వచ్చినా రైతులకు నిద్ర పట్టదు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పొలం రికార్డుల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరోలా ఉంటే వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో భూ రీ-సర్వేను పక్కాగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
రీ-సర్వే మొదలవ్వడానికి ముందే రైతులు భూ భారతి పోర్టల్ నుంచి తమ పహాణీ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. ఊర్లో దండోరా వేయించి, గ్రామసభలు నిర్వహించి అందరికీ సమాచారం ఇస్తారు. సర్వేకు కనీసం నాలుగు రోజుల ముందే పట్టాదారులకు నోటీసులు అందుతాయి. రెండు రోజుల ముందు జెండాలు ఇచ్చి పొలం సరిహద్దుల్లో పాతమని చెబుతారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ భూముల విషయంలో గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో పెట్టడంతో పాటు సంబంధిత శాఖలకు ఫారం-10 నోటీసులు ఇస్తారు.
క్షేత్రస్థాయిలో సర్వే, ఖాతా నంబర్లు, భూమి వర్గీకరణ, విస్తీర్ణం పరిశీలించి కొలతలు పూర్తయ్యాక వెంటనే రైతుకు చెబుతారు. పహాణీలో ఉన్న విస్తీర్ణానికి, కొలిచిన విస్తీర్ణానికి తేడా వస్తే కారణాలు, పేర్ల తేడాలు, ఎవరి స్వాధీనంలో ఉందనే వివరాలు నమోదు చేసి భూ భారతి పోర్టల్లో ఎక్కిస్తారు. విస్తీర్ణంలో తేడాలు ఉన్న గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో మూడు నాలుగు రోజులు శిబిరాలు పెట్టి, గ్రామ పెద్దలు, బాధితులు, పక్క రైతులతో మాట్లాడి వివాదాలు పరిష్కరిస్తారు.
తహసీల్దార్ ఆమోదం తర్వాత సర్వే చట్టంలోని సెక్షన్ 9 కింద నోటీసులు ఇస్తారు. అప్పీల్ గడువులో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు తనిఖీలు చేస్తారు. అభ్యంతరాలు, అప్పీళ్లు తేలాకే సెక్షన్ 13 కింద తుది గెజిట్ ఇచ్చి, ఆ తర్వాతే రికార్డ్ ఆఫ్ రైట్స్ మార్చి భూ భారతిలో అప్డేట్ చేస్తారు








