AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘విదేశీ గడ్డపై భారత్ పరువు తీస్తున్నారు’..! రాహుల్‌ గాంధీపై కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!

సెంచరీ డిఫీటెడ్ లీడర్ గా రాహుల్ గాంధీ అవతరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అయినా కూడా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారి ఆలోచన ఏంటనే విషయాన్ని రాహుల్ గుర్తించలేకపోతున్నారన్నారు. అందుకే దేశంలోని రాజ్యాంగ సంస్థలపై, దేశ ప్రజలపై ఆరోపణలు చేస్తున్నారని, కనీస ఆలోచన లేకుండా ఎలా పడితే అలా విమర్శించడమే ఎజెండాగా పెట్టుకుని మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఇప్పటివరకు ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా చేయలేదని ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టను మంటగలిపే ఎజెండాతో అంతర్జాతీయ వేదికలపై దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొలంబియా యూనివర్సిటీలో భారత ఆర్థిక వ్యవస్థపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ విమర్శలు చేయొచ్చని, కానీ దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలను అంతర్జాతీయ వేదికలపై విమర్శించడం 140 కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని అన్నారు.

భారత్ ఆర్థిక సంక్షోభంలో ఉందన్న రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమని, తయారీ, రక్షణ, సెమీకండక్టర్, ఆటోమొబైల్ రంగాల్లో దేశం గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో కరోనా సమయంలో వైద్య పరికరాలను తయారు చేయడమే కాకుండా, 80 దేశాలకు వ్యాక్సిన్లు అందించామని గుర్తుచేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్ గౌరవం పెరిగిందని, జీ-20, బ్రిక్స్, క్వాడ్, ఎస్ సీవో వంటి వేదికల్లో దేశం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేశం అంతర్జాతీయంగా తగిన గుర్తింపు పొందలేదని విమర్శించారు. నెహ్రూ హయాంలో అక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా ఆధీనంలోకి వెళ్లిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మోడీ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని, ప్రజల విశ్వాసం ఉన్నంతకాలం మోదీ, బీజేపీని ఎవరూ ఓడించలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి బలం లేదన్న విమర్శలను కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ స్థానాలు, రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.

ANN TOP 10