AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరెంటు కష్టాలపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన బీఆర్‌ఎస్‌..!

అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రంగ ప్రవేశానికి బీఆర్‌ఎస్‌ వీరంగం వేసినా.. అది అట్టర్‌ ఫ్లాప్‌ అయి కూర్చుంది. తామొకటి తలిస్తే.. అక్కడి జరిగింది మరొకటి అన్నచందంగా మారింది పరిస్థితి. అంతే కాదు.. బద్నాం కూడా అయ్యింది ఎమ్మెల్సీ మధు నోటి దురుసు వల్ల.

దీన్ని ఓ అస్త్రంగా తీసుకున్నది సర్కార్‌. సమావేశాల్లో అసలు ముచ్చట పక్కకు పోయి.. ఇదే విషయం ప్రధాన చర్చై కూర్చున్నది. స్పీకర్‌ కంటి తడి, కేసీఆర్‌కు చావు డప్పు, దళితుల సంప్రోక్షణకు పసుపు నీళ్లు.. పోటాపోటీ పోలీసు ఫిర్యాదులు.. అంతిమంగా ఇది ఫామ్‌హౌజ్‌ కుట్రగా తేల్చేశారు రేవంత్‌.

దీనిపై ఓ సిట్‌ కూడా వేశారు. మొత్తం ఈ ఎపిసోడ్‌లో బద్నామయ్యింది బీఆర్ఎస్‌ పార్టే. వ్యూహ రచనలో తన అనుభవాన్నంత రంగరించి దిశానిర్దేశం చేసి పంపితే.. ఇలా తిట్లు తిట్టి… మాటలు పడి.. అందరితో చివాట్లు తిని మరీ వెనుదిరిగిన కేటీఆర్‌ టీంను చూసి కేసీఆర్‌ కూడా చాలా ఇబ్బంది పడే ఉంటాడంటే అతిశయోక్తి కాదేమో.

బ్లాక్‌ టీషర్టులు వేసుకురావడమే ఓ పొరపాటుగా మారితే.. హరీశ్‌రావు ఆ అంగీని విప్పి మరీ మరీ తప్పు చేసినట్టే అయ్యింది. అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లు ఇబ్బంది పడ్డారనే కారణంతో ఏకంగా సర్కార్‌ .. కేసీఆర్, కేటీఆర్‌లపై కేసులు పెట్టేదాకా పోయింది పరిస్థితి అంటే.. ఇది ఇంతలా బూమరాంగ్‌ అయి కూర్చుంటుందని కనీసం ఊహించలేకపోయింది కేటీఆర్‌ టీమ్‌.

అయితే దీన్ని ఎలా రికవరీ చేసుకోవాలి.. ప్రజలను దీని నుంచి ఎలా డైవర్టు చేయాలనే ఆలోచన చేస్తున్న తరుణంలోనే .. హరీశ్‌ రావుకు ఓ అద్బుతమైన దారి కనిపించింది. నాగర్‌ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో.. సీఎం సొంత ఊరిలో రైతులు రోడ్డెక్కారు. కరెంటు కష్టాలను ఏకరువు పెడుతూ రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు.

కొంత మంది రైతులు అంగీలు విప్పి రోడ్డు మీద పడుకుని మరీ నినాదాలు చేశారు. ఐదారు గంటల కరెంటుతో పంటలు ఎండిపోతున్నాయని, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

ఇదే టాపిక్‌పై హరీశ్‌ తెలంగాణ భవన్‌లో హడావుడిగా ప్రెస్‌మీట్‌ పెట్టారు. మేము కూడా ఇదే తరహాలో రైతు సమస్యలపై నిరసన తెలిపేందుకు అసెంబ్లీ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేశామని, కానీ సర్కార్‌ మమ్మల్నే కొట్టి తిరిగి కేసులు పెట్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం సొంత ఊరిలోనే ఈ పరిస్థితి ఉందని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత గ్రామంలో కూడా రైతులు ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేశారని ముందేసుకున్నారు బీఆరెస్ నేతలు.

కరెంటు ఉత్పత్తిలో రేవంత్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైందని, ఇది ఎల్‌నినో తెచ్చిన కరువు కాదని, పాలకుడి అసమర్థ పాలన వల్ల వచ్చిన కరువని హరీశ్‌ .. రేవంత్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

ANN TOP 10