AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ..! టాస్క్​ ఫోర్స్ చిక్కిన గ్యాంగ్..!

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న గ్యాంగును శంషాబాద్​ జోన్ టాస్క్​ ఫోర్స్​ అధికారులు బాలాపూర్​ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటింగ్​ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ కే.ఎస్​.రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చింతల్​ తండాకు చెందిన రామావత్​ రాము అలియాస్ మహ్మద్ (36) వృత్తిరీత్యా జొమాటో డెలివరీ బాయ్​. అదే తండాకు చెంది ర్యాపిడో డ్రైవర్​ గా పని చేస్తున్న రామావత్ మోతీలాల్​ (35), ఆటోడ్రైవర్ రామావత్​ గాంధీ (19), నాగోల్​ బండ్లగూడకు చెందిన సుధీర్​ జాన్​ చేలా అలియాస్​ వంశీతో అతనికి పరిచయం ఉంది.

జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్న పనితో ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో రామావత్ రాము తేలికగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్ల దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బంధువైన రామావత్ మోతీలాల్‌ తో కలసి యూట్యూబ్, ఇన్‌ స్టాగ్రామ్‌ లలో నకిలీ నోట్ల తయారీ వీడియోలు చూశాడు. మోతీలాల్‌ యూ ట్యూబ్‌లో దొరికిన ఓ ఫోన్ నెంబర్​ ను సంప్రదించి అవసరమైన ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్ల వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత రామావత్ మోతీలాల్​, రామావత్ గాంధీతో కలిసి ప్రింటింగ్ పరికరాలు కొనుగోలు చేశారు.

అచ్చం అసలు నోట్లలా కనిపించేలా వాటర్‌ మార్క్‌ లతో నకిలీ నోట్లను తయారు చేశారు. రాత్రి వేళల్లో వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లలో ఈ నోట్లను చలామణి చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్​ ఫోర్స్​ సీఐ డీ.కృష్ణమోహన్​, బాలాపూర్​ సీఐ సుధాకర్​, ఎస్​ఐ మన్సూర్ అలీతోపాటు సిబ్బందితో కలిసి నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి నాలుగు అసలైన 500 రూపాయల నోట్లు, నాలుగు వంద రూపాయల నోట్లతోపాటు 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటర్​, స్కానర్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం బాలాపూర్​ పోలీసులకు అప్పగించారు.

ANN TOP 10