AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ, ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలతో కూడిన ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుళ్ల సాక్షిగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్‌ విస్మరించి ప్రజలను వంచించిందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, తులం బంగారం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్ల పెంపు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి కీలక హామీలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఆందోళనలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బండ శ్రీనివాస్‌, వాల బాలకిషన్‌రావు, పోల్నేని సత్యనారాయణరావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేశ్‌లతో పాటు నియోజకవర్గ పరిధిలోని వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ANN TOP 10