AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అర్హత లేని వ్యక్తులను కలవాలనుకున్నారు’.. రేవంత్‌ అమెరికా టూర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం చేసిన ఆరోపణలు అర్థరహితమని మండిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనను హడావుడిగా ఖరారు చేసుకున్నారని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి గతంలో అమెరికా, లండన్‌ సహా ఇతర దేశాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈసారి మాత్రం స్పష్టమైన పరిపాలనా కారణాలతో విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. విదేశీ పర్యటనల్లో ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తారు? ఆ సమావేశాలతో దేశానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అనే అంశాలను విదేశాంగ శాఖ పరిశీలిస్తుందని వివరించారు.

అమెరికా పర్యటనలో రేవంత్‌రెడ్డి అర్హత లేని వ్యక్తులను కలవాలని నిర్ణయించుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే, భారత్‌పై విమర్శలు చేసే వ్యక్తితో సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోల్చిన వ్యక్తి న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ కాదా? అని నిలదీశారు. న్యూయార్క్‌లో హిందువుల పండుగలపై ఆంక్షలు విధించిన వ్యక్తితో సీఎం భేటీ కావడం ఏంటని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి తన హోదాకు తగిన వ్యక్తులతోనే చర్చలు జరపాలని కిషన్‌రెడ్డి సూచించారు. సీఎం స్వయంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పెట్టుబడుల కోసం అధికారుల బృందాన్ని పంపినా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. 2005లో గుజరాత్‌ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని కూడా కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.

ANN TOP 10