హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిక్రోనా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 29 ఏళ్ల సంధ్య అనే ఉపాధ్యాయురాలిని ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మాస్క్ ధరించి పాఠశాలలోకి వచ్చిన నిందితుడు.. సంధ్యతో మాట్లాడాలని నిర్వాహకులకు చెప్పడంతో ఎలాంటి అనుమానం లేకుండా ఆమె బయటకు వచ్చింది.
బుధవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో టీచర్ బయటకు వచ్చిన వెంటనే నిందితుడు ఆమె మెడ పట్టుకుని ఈడ్చుకెళ్లి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఆమె ముఖం, మెడ, ఛాతీపై 30కి పైగా కత్తిపోట్లు పొడిచినట్లు వెల్లడించారు. తీవ్ర గాయాలతో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ దారుణ ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. స్కూల్ వంటి విద్యా సంస్థలోనే ఇంతటి ఘోరం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.








