145 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియాపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉత్పత్తులపై ‘100% సహజం’, ‘100% స్వచ్ఛమైనది’, ‘100% స్వచ్ఛతకు హామీ’, ‘100% సేంద్రీయం’ వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇలాంటి వాదనలతో మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అలాగే, ఈ అంశంపై 15 రోజుల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని కంపెనీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించినట్లు వెల్లడైంది. ఉత్పత్తులపై చేస్తున్న ప్రకటనలు, వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉండవచ్చని తెలుస్తోంది.
ఇలాంటి ప్రకటనలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018 నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ పేర్కొన్నట్లు సమాచారం. వినియోగదారులకు ఉత్పత్తుల స్వభావం, నాణ్యతపై స్పష్టమైన సమాచారం అందించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని, తప్పుడు లేదా అతిశయోక్తి క్లెయిమ్స్‌పై భవిష్యత్తులోనూ చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.








