హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో మంగళవారం ఉదయం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా నల్లగండ్ల జంక్షన్ నుంచి గచ్చిబౌలి వరకు తీవ్ర రద్దీ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండాపూర్–శ్రీరామ్‌నగర్, మసీద్‌బండ రోడ్డు, కొత్తగూడ నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ మార్గం, హైటెక్ సిటీ–కేపీహెచ్‌బీ రహదారుల్లోనూ వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం కూడా ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
హైదరాబాద్‌లో వర్షం పడిన ప్రతిసారీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తడానికి నాలాల ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలు పూడుకుపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కేవలం రహదారుల విస్తరణతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, నాలాల పునరుద్ధరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, జీహెచ్‌ఎంసీ–ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








