పెళ్లి చేసుకున్న జంటలకే కాకుండా.. వివాహ బంధం లాంటి సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహ హింస నిరోధక చట్టాలు వర్తిస్తాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భాగస్వామిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సాగించే సహజీవనంలో మహిళలపై క్రూరత్వానికి పాల్పడితే.. భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A కింద పురుషుడిపై నేరారోపణ మోపి విచారించవచ్చని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ‘లోకేష్ vs కర్ణాటక ప్రభుత్వం’ కేసులో ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
అయితే, అన్ని రకాల సహజీవన బంధాలకూ ఈ శిక్షాస్మృతి నిబంధన వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తాము పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఒకే ఇంట్లో కలసి ఉన్నామని నిరూపించాల్సిన ప్రాథమిక బాధ్యత రక్షణ కోరే మహిళపైనే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు సామాజిక మార్పులకు అనుగుణంగా చట్టాలు కూడా స్పందించాల్సి ఉంటుందని.. గృహ హింసను నిరోధించే క్రమంలో వివాహిత మహిళలకు, వివాహం లాంటి బంధంలో ఉన్న మహిళలకు మధ్య వ్యత్యాసం చూపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
కేసు వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ లోకేష్ బి.హెచ్ అనే వ్యక్తి.. తనకు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సదరు మహిళపై అదనపు కట్నం కోసం వేధింపులకు దిగి, ఆమెను తగలబెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే తమ మధ్య జరిగిన రెండో పెళ్లి చట్టబద్ధంగా చెల్లదు కాబట్టి.. తాము ‘భార్యాభర్తలు’ కామని.. అందువల్ల తనపై సెక్షన్ 498A వర్తించదని లోకేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో.. ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు కూడా పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది.









