ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో అధికారులు సంచలన వివరాలు పేర్కొన్నారు. ఇన్ స్టాగ్రాం ద్వారా ఆయనకు మహిళా ట్రెయినీ ఐపీఎస్ తో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాత జాతీయ పోలీస్ అకాడమీలో వారు దగ్గరయ్యారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ గా మారిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవిత చరిత్ర చూసి మహిళా ట్రెయినీ ఐపీఎస్ పరిచయం పెంచుకున్నారని వెల్లడించారు. ఇరువురి మధ్య చాలాకాలం పాటు సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే కొన్ని రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇతరులతో మాట్లాడితే మహిళా అధికారిణిని ఉదయ్ కృష్ణారెడ్డి వేధించేవారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో దాడి కూడా చేసినట్టు పేర్కొన్నారు. సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో వీరు విడిపోయారని వెల్లడించారు. ముస్సోరీలో జరిగిన ట్రైనింగ్‌లో మళ్లీ కలుసుకున్నారని తెలిపారు. అప్పటినుంచి వీరి మధ్య సంబంధాలు కొనసాగాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
కొద్దిరోజులు బాగానే ఉన్నా తర్వాత మహిళా ట్రెయిని ఐపీఎస్ ను ఉదయ్ కృష్ణారెడ్డి తరచూ అనుమానంతో వేధించేవాడని చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి తీరుతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వెల్లడించారు. మళ్లీ ఎమోషనల్‌గా ఆమెకు దగ్గరయ్యారని అన్నారు. ఐదుసార్లు మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను కొట్టాడని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కూడా అతని తీరు మారలేదన్నారు. దాంతో వారిద్దరి మధ్య మళ్లీ విభేదాలు వచ్చాయని తెలిపారు. నేషనల్ పోలీస్ అకాడమీలో అధికారులకు ఇంటర్నల్‌గా మహిళా ట్రెయినీ ఐపీఎస్ ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
ఇక, మహిళా ట్రెయినీ ఐపీఎస్‌కు మే నెలలో వివాహం జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరింతగా ఆమెకు వేధింపులు పెరిగాయని చెప్పుకొచ్చారు. దాంతో బాధితురాలు తన భర్త సహకారంతో అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మరికొంత మంది అమ్మాయిలతో ఉదయ్ కృష్ణారెడ్డి చాటింగ్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. చాలామంది యువతులను ఉదయ్ వేధించారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు తన స్వగ్రామంలో కూడా కొంతమంది అమ్మాయిలను ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారని వెల్లడించారు. పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్‌లో మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.







