హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆక్రమణల తొలగింపు చర్యలతో నిలుస్తున్న ఆయన, తాజాగా ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానానికి తన అఫిడవిట్‌ను సమర్పించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవముందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అఫిడవిట్‌లో ప్రధానాంశాలు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2 ల పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లనే లేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అవాస్తవాలు చెప్పారని, నిబంధనలకు లోబడే తాము వ్యవహరిస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
హైకోర్టు తీవ్ర ఆగ్రహం
విచారణ సమయంలో హైకోర్టు కమిషనర్ తీరుపై ఘాటుగా స్పందించింది. రంగనాథ్‌పై ఇప్పటివరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక్క అధికారిపైనే ఇన్ని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని నిలదీసింది. చట్టపరిధి దాటి నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించిన న్యాయస్థానం, ప్రజాప్రయోజనాలు ముఖ్యమే అయినా న్యాయపరమైన ప్రక్రియను విధిగా పాటించాలని స్పష్టం చేసింది.
అదే విధంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి కోర్టు ఆదేశించింది.








