ఇంకా మీ రక్తదాహం తీరలేదా? అని కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా సరిపోలేదా? అని నిలదీశారు. ఎక్స్ వేదికగా ఆదివారం పైర్ అయ్యారు. తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? అని ప్రశ్నించారు.
ఎన్ కౌంటర్ల పేరుతో..
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు.. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు అని మండిపడ్డారు. 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!, మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు అని ధ్వజమెత్తారు.
రైతులకు నీళ్లు ఇవ్వు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు! అని కోరారు. పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..! నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం! అని స్పష్టం చేశారు. మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి అని విజ్ఞప్తి చేశారు.








