ఎల్ నినో పరిస్థితులతో రైతులకు నష్టం కలుగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వ విద్యాలయం, ఇక్రిశాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో సోమవారం ఇక్రిశాట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసిందన్నారు. మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక , జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయగా ఈనెల 15 నుంచి అమలు చేయాల్సిన ప్రణాళిక పై మరోమారు అధికారులు శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా..
గత ఖరీఫ్ లో 1.40 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవ్వగా.. అందులో 70 లక్షలు వరి సాగైనట్టు తెలిపారు. ఈ వానాకాలం ఎల్-నినో పరిస్థితులు ఉన్నప్పటికి ఇప్పటికే 60 లక్షల ఎకరాలలో వివిధ పంటలు వేసినట్టు వివరించారు. అయితే ఎల్నినో ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ సీజన్లో వరి పంట 30-40లక్షల ఎకరాలలో సాగు అయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. అందుకనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాలకు 3 దశలలో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఎల్-నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్యలో విరామాలు ఏర్పడటం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ఆధారంగా చేసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కాంటీజెన్సీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
20 జిల్లాలపై ప్రత్యేక దృష్టి..
ఈ నెల 10 నాటికి రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదైందన్నారు. లోటు జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.ప్రతి జిల్లాలో వర్షపాతం, సాగు పురోగతి, నేల తేమ, విత్తనాల లభ్యత, రైతుల అవసరాలపై రోజువారీ నివేదికలను విశ్లేషిస్తూ, అవసరమైన చోట వెంటనే ప్రత్యామ్నాయ కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.
శాస్త్రీయ విధానాలతో ఎల్-నినోను ఎదుర్కొంటున్నాం
రాష్ట్రంలో డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్ (డీఎస్ఆర్) అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వర్షభావ పరిస్థితుల అధ్యాయనం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, భూగర్భ జలాల లభ్యత పై నిరంతర పర్యవేక్షణ , పంటల పెరుగుదల, వాతావరణ పరిస్థితుల అంచనా, కాంటీజెన్సీ క్రాప్ ప్లానింగ్ తదితర శాస్త్రీయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు కనీసం 50 మిల్లీమీటర్ల వర్షపాతం వరుసగా రెండు నుంచి మూడు రోజులపాటు నమోదై భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని మంత్రి సూచించారు. వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశెనగ, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేయాలని కోరారు.
విత్తనాలు, ఎరువుల కొరత ఉండదు
రాష్ట్రంలో అవసరమైన విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే సమగ్ర అంచనా పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా మార్క్‌ఫెడ్, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు.జిల్లా, మండల స్థాయిలో ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లను తగినంతగా నిల్వ చేశామని, రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపులు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా రైతులకు నిరంతరం సాంకేతిక సూచనలు అందిస్తున్నామని తెలిపారు.
ఎల్-నినో ప్రభావాలు..
మంగళవారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఎల్-నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అన్నారు. ఎల్-నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతు నష్టపోకుండా అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం. ప్రతి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుకు అండగా ఉంటుంది.” అని మంత్రి పేర్కొన్నారు.








