AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం సాగు, తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పుడు డిజైన్లు, నాణ్యతా లోపాల వల్ల 2023 అక్టోబర్‌లో బారేజీలు దెబ్బతిన్నాయని, అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మూడు పూర్తి వర్కింగ్ సీజన్లు(2024, 2025, 2026 జనవరి నుంచి జూన్ వరకు) సమయం దొరికినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

 

నిపుణుల సూచనల ప్రకారం..

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సిఫార్సులను సకాలంలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం బారేజీల పునరుద్ధరణ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కానీ కేంద్రం వేసిన నిపుణుల కమిటీదే ఈ బాధ్యత అంటూ కేంద్ర కమిటీపై నెపం వేసి తప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరుత్సాహపూరిత వైఖరి వల్ల ఈ కరవు కాలంలో సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేకపోయారని ఆరోపించారు. నిపుణుల సూచనల ప్రకారం మేడిగడ్డ గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా, అలాగే అన్నారం, సుందిళ్ల నుంచి నీటిని ఎత్తిపోసి ఉంటే ఉత్తర తెలంగాణలోని 20 నుండి 25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కైంది..

రేవంత్ చేతగానితనం వల్లే ఉత్తర తెలంగాణకు నీరు అందట్లేదని విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు బహిరంగపరచడం లేదని రాంచందర్ రావు ప్రశ్నించారు. కేవలం ఒకరిద్దరిపైనే నామమాత్రపు చర్యలు తీసుకున్నారని విమర్శించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టులో సరిగ్గా డిఫెండ్ చేయడంలో విఫలమై, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లకుండా బీఆర్‌ఎస్ పెద్దలతో కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కైందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విలువ దాదాపు రూ.1.30 లక్షల కోట్లు కాగా, కేవలం రూ.10,000 కోట్ల వ్యయంతో కూడిన మూడు బారేజీల నిర్మాణ లోపాలపై మాత్రమే సీబీఐ విచారణ కోరడం వెనుక ఉన్న మతలబేంటని రాంచందర్ రావు ప్రశ్నించారు. పంప్ స్టేషన్లు, కెనాల్స్, టన్నెల్స్ వంటి పూర్తి ప్రాజెక్టు అవినీతిపై విచారణ కోరడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారని, ఇదంతా కేవలం కంటితుడుపు చర్యేనని దుయ్యబట్టారు. రాజకీయాలను పక్కనబెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన అందించేలా ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

 

ఘోరంగా వైఫల్యం..

ఇదిలా ఉండగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని వివేకానంద కాలనీలో బీజేపీ నూతన కార్యాలయాన్ని రాంచందర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మూడు కార్పొరేషన్లపై బిజెపి జెండా ఎగరడం ఖాయమని, ఈ మూడింటిలోనూ బీజేపీ మేయర్లే పీఠాన్ని అధిరోహిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని, జీహెచ్ఎంసీ ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు.

 

మున్సిపల్ ఎన్నికల్లో..

పూర్వం మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన హన్మంతరావు పార్టీ కోసం విరాళంగా ఇచ్చిన స్థలంలోనే ఈ నూతన కార్యాలయాన్ని నిర్మించినట్లు గుర్తుచేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో పార్టీ పెద్దఎత్తున విజయం సాధించడానికి ఈ కార్యాలయమే ప్రధాన వ్యూహ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని మండిపడ్డారు. నగరంలో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఉందని, వర్షాకాలం వచ్చేలోపు వరద ముంపు నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని తాము మొదటి నుంచి హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

రాజకీయ పబ్బం కోసం..

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, పడిన చిన్నపాటి వానలకే నగరం జలమయమై ట్రాఫిక్ స్తంభిస్తోందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం ఎంఐఎం తో దోస్తీ చేస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయే తప్ప, నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. అందుకే విసిగిపోయిన నగర ప్రజలు ఈసారి బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

 

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాకు సంఘీభావం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేయకుండా ఉండేందుకు, విద్యాశాతాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చిందని రాంచందర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు, ఏజెన్సీల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకు ఆయన హాజరై కార్మికులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఎంతో పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తూ, పిల్లలకు అన్నం పెడుతున్న 54 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

నెలకు రూ.10,000 గౌరవ వేతనం..

గత ఎన్నికల మేనిఫెస్టోలో మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్నా ఆ మాటను నిలబెట్టుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నా, పదేళ్ల క్రితం నాటి రేట్ల ప్రకారమే నిధులు ఇవ్వడం వల్ల కార్మికులు అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాంచందర్ రావు భరోసా..

ప్రస్తుతం ఇస్తున్న రూ.3,000 అరకొర వేతనాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా పెండింగ్‌లో పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పెంచుతామని చెప్పిన రూ.10,000 వేతనాన్ని, పెండింగ్‌లో ఉన్న బకాయిలతో సహా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే జమ చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కార్మికులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్మికుల హక్కుల సాధన కోసం బీజేపీ తరపున తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని రాంచందర్ రావు భరోసా ఇచ్చారు.

ANN TOP 10