నటుడు ప్రకాశ్ రాజ్‌పై సినీ నిర్మాత బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలకు ప్రకాశ్ రాజ్ ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిపై బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల్లో నిజాయతీ లేదని, అవి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
వివరాల్లోకి వెళితే.. “ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం” అంటూ ప్రకాశ్ రాజ్ నేడు ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనపై వస్తున్న విమర్శలు, తప్పుడు ప్రచారాలపై ఆయన ఆ వీడియోలో స్పందించారు.
ఈ పోస్టుపై బండ్ల గణేశ్ ఘాటుగా స్పందించారు. ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ, “ఎవరితోనో ట్వీట్ రాయించుకుని వచ్చి పోస్ట్ చేయడం కాదు. మాట్లాడటం అంటే సినిమాల్లో రాసిచ్చిన డైలాగ్‌ను తెలుగు డబ్బింగ్ చెప్పినట్టుగా కాదు. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు… నిజాయతీ కావాలి, తమ్ముడూ!” అని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా, “పైసా కొట్టు… డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాశ్ రాజ్, ఫ్రమ్: కర్ణాటక” అంటూ మరో వ్యంగ్యాస్త్రం సంధించారు.








