దుబాయ్‌లో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును, కార్మికులతో వెళ్తున్న మినీబస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. ట్రక్కు అకస్మాత్తుగా ఆగడం, అదే సమయంలో మినీబస్సు డ్రైవర్ తగినంత సురక్షిత దూరం పాటించకపోవడం, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారత అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. స్థానిక అధికారులతో కలిసి బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నట్లు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.








