AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పటాన్‌చెరులో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయం.. కవిత సంచలన వ్యాఖ్యలు..!

పటాన్ చెరు పర్యటన సందర్భంగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయని కవిత మండిపడ్డారు. ఇక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఆయన తన ఆర్థిక వనరులను మాత్రం భారీగా పెంచుకున్నారని ఆరోపించారు. స్థానిక బీజేపీ ఎంపీ కూడా ఎమ్మెల్యేతో చేతులు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టపగలే ఒక స్కూల్‌ను బుల్డోజర్లతో కూల్చివేస్తుంటే అన్ని పార్టీల మద్దతు లేకుండా అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

 

ముంచెత్తుతున్న కాలుష్యం

 

ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్‌గా పేరొందిన పటాన్ చెరు.. గత మూడు దశాబ్దాలుగా తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నక్కవాగు వ్యర్థాల వల్ల మంజీరా నది సైతం అపవిత్రమైందని, భూగర్భంలో కిలోమీటరు లోతు వరకు నీరు కలుషితమైందని పేర్కొన్నారు. దీనివల్ల ఇళ్లు కట్టుకోవాలన్నా, బోర్ వేయాలన్నా, పంటలు పండించాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కాలుష్యం తగ్గించే చర్యలు తీసుకోకుండా, ఇక్కడి పరిశ్రమలను తరలిస్తామని చెప్పడం ప్రజల ఉపాధిని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.

 

తెలంగాణ రక్షణ సేన లక్ష్యం

 

తెలంగాణ వనరులను, భూములను కాపాడటమే ధ్యేయంగా తెలంగాణ రక్షణ సేన పుట్టిందని కవిత ప్రకటించారు. అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్, కాలుష్యం లేని సరికొత్త తెలంగాణ కోసం తాము పోరాడుతామన్నారు. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఎలా కల్పించాలనే అంశంపై స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని ఆమె పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా ఆమె స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ANN TOP 10