శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ పోలీసులు గురువారం రాత్రి కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ కవచ్ ను జరిపారు. ఈ క్రమంలో నెంబర్ ప్లేట్లను ట్యాంపర్ చేసి ఉన్న 2,140 వాహనాలను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పీలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ సందర్శించారు. కొన్ని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను నిశితంగా పరిశీలించారు.
వివిధ జోన్లలో వాహనాలు తనిఖీ
నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనదారులతో నేరుగా మాట్లాడి, నిబంధనలు పాటించకపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు కలిగి ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించారు. అనంతరం, ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నగరవ్యాప్తంగా వివిధ జోన్లలో కలిపి మొత్తం 12,098 వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పలు వాహనాలు స్వాధీనం
ఇందులో 8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 కార్లు, 1,623 ఆటోలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు ఉన్న 1,406 వాహనాలు, అసలు నంబర్ ప్లేట్లే లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. వీటిలో 2,046 ద్విచక్ర వాహనాలు, 52 కార్లు, 51 ఆటోలు ఉన్నాయి. జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గోల్కొండ జోన్ పరిధిలో 530, చార్మినార్ జోన్ పరిధిలో 444 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ..
దీనిపై కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ నగర ప్రజల రక్షణ కోసం ఆపరేషన్ కవచ్ ను చేపట్టినట్లు చెప్పారు. నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌ను కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబోమని స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చడం, అస్పష్టంగా ఉంచడం సమాజ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారన్నారు. దీనివల్ల అమాయక వాహనదారులకు తప్పుడు ఈ-చలాన్లు వెళ్లడమే కాకుండా, కొన్నిసార్లు వాళ్లు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. ఇలా చేసేవారిపై ఛీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
టూ వీలర్స్ పై ఫోకస్
ఆపరేషన్ కవచ్ లో భాగంగా టూ వీలర్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. భవిష్యత్తులో అన్ని రకాల వాహనాలపై దశల వారీగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. తనిఖీల్లో అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాసులుతోపాటు ఐపీఎస్ అధికారులు తఫ్షీర్ ఇక్బాల్, జోయల్ డేవిస్,.శ్వేత, వెంకటేశ్వర్లు, చైతన్య కుమార్, కిరణ్ ఖారే,శిల్పవల్లి, శ్రీనివాస్, చంద్ర మోహన్, రమణా రెడ్డి, రాజేష్, అరవింద్ బాబు, లావణ్య నాయక్ జాదవ్, అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.







