సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ కుంభకోణం పై వెంటనే విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిలో మరో భారీ కుంభకోణం కార్మిక లోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస స్కాంలతో వణికిపోతున్న సింగరేణిలో 1600 కోట్లు విలువచేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతుకోసే కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోందని, సింగరేణి అధికారిక వెబ్ సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు.
40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్ సెస్ తోపాటు, ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ చూస్తున్న మీ హయాంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1 లో ఆరు లక్షలు, రామగుండం-2 లో నాలుగు లక్షలు, భూపాలపల్లిలో 5 లక్షల 40 వేలు, ఇల్లందులో 3 లక్షల 50 వేలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించారన్నారు. కానీ కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారం అని పేర్కొన్నారు.
ఏప్రిల్ నెలలోనే బొగ్గు గనులపై నిలువలను తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారుల బృందాలు రాకపోవడం, చివరికి కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే బలమైన అనుమానం కార్మికలోకాన్ని వెంటాడుతోందన్నారు. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిల పక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. అప్పుడే సింగరేణిలో సాగుతున్న ఈ భారీ అక్రమాల పుట్ట బద్దలవుతుందన్నారు.
గతంలో నైని స్కామ్ తోపాటు.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల నిబంధనలకు పాతరేసి నేషనల్ ఆవరేజీని కూడా మించి అత్యధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని అర్థాంతరంగా రద్దుచేసి అందులోనూ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. అలాగే పేలుడు పదార్థాల కొనుగోళ్లలోనూ కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక నిధులు చెల్లించి అనుయాయులకు కట్టబెట్టారన్నారు. అంతే కాకుండా చివరికి మెస్సీతో ముఖ్యమంత్రి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం 110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలా వరుస కుంభకోణాలు జరుగుతున్నా అక్రమార్కుల భరతం పట్టకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం వెనక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమని కార్మికులకు అర్థమైపోయిందని ఆరోపించారు.
సింగరేణిలో జరుగుతున్న అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చేందుకు చివరికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా వివరాలు బయటకు పొక్కకుండా దుష్టశక్తులు అడ్డుకుంటున్న దుస్థితి నెలకొందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రెండున్నరేళ్లుగా వరుస కుంభకోణాలు జరుగుతున్నా మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పట్టించుకోకపోవడం పట్ల సింగరేణి కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టి సంస్థను దెబ్బతీసే కాంగ్రెస్-బీజేపీల కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ సహించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కిషన్ రెడ్డికి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో మీకున్న రహస్య ఒప్పందాల కారణంగా సింగరేణి సంస్థను బలిచేయోద్దని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన 1600 కోట్ల సింగరేణి బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కార్మికుల పక్షాన కేటీఆర్ డిమాండ్ చేశారు.








