AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి అన్నామలై గుడ్ బై..? త్వరలో కొత్తపార్టీ..!

తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర మాజీ బీజేపీ చీఫ్ కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్దమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పార్టీలో తనకు అవకాశాలు, భవిష్యత్తు రెండూ లేవని అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ తో భేటి అయ్యి.. అనంతరం పార్టీకి రాజీనామా చేయాలని అన్నామలై నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

కొద్ది రోజులుగా బీజేపీకి దూరం

41 ఏళ్ల అన్నామలై.. తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనదైన ముద్ర సైతం వేశారు. అయితే గత కొంతకాలంగా అన్నామలై అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం బీజేపీ తరపున బరిలోకి సైతం ఆయన దిగలేదు. దీనికి తోడు ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకొని.. తమిళనాడులో పూర్తిగా డీలా పడిపోయింది. దీంతో ఆ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని అన్నామలై ఒక అభిప్రాయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

 

టీవీకే చీఫ్ విజయ్ తరహాలోనే తమిళనాడులో కొత్త పార్టీని ఏర్పాటు చేసి.. తనదైన ముద్ర వేయాలని అన్నామలై యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కొత్తపార్టీ ఏర్పాటుకు సంబంధించి తమిళనాడులో జోరుగా ప్రచారం సైతం మెుదలైంది. కోయంబత్తూర్ వంటి ఏరియాల్లో ఆయన కొత్తపార్టీకి సంబంధించి పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే అన్నామలై తొలుత కాక్రోచ్ తరహాలో జెన్ జీ ఉద్యమాన్ని లేవనెత్తుతారని, ఆ తర్వాత కొత్త పార్టీ ప్రకటన చేస్తారన్న ప్రచారం తమిళనాట జరుగుతోంది. ఈ క్రమంలోనే దిల్లీ విమానం ఎక్కేందుకు చెన్నై విమానాశ్రయానికి అన్నామలై వెళ్లగా.. అక్కడ విలేకారులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

 

బీజేపీ పార్టీని వీడనున్నారా? అన్న ప్రశ్నను అన్నామలై ఏమాత్రం ఖండించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ‘దయచేసి వేచి ఉండండి. మనం రెండ్రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందాం’ అని సమాధానం ఇస్తూ అన్నామలై దిల్లీకి పయనమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబిన్ తో భేటి అయ్యి.. తన రాజీనామా అంశాన్ని అన్నామలై ఆయన ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఆ భేటి అనంతరం తుది నిర్ణయాన్ని ఆయన ప్రకటించే అవకాశముందని సమాచారం. కాగా జూన్ 4న అన్నామలై పుట్టినరోజు. దీంతో చెన్నైలోని ప్రధాన రహదారులు, వీధుల వెంబడి అన్నామలై పోస్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున దర్శనమిస్తుండటం కూడా ఆయన కొత్త పార్టీ ఊహాగానాలకు బలాన్ని ఇస్తోంది.

 

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సారథ్యంలో నడిచేందుకు 2020లో అన్నామలై బీజేపీలో చేరారు. ఆ వెంటనే తొలుత తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది తర్వాత ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై మారారు. అన్నామలై సారథ్యంలో బీజేపీ ప్రాబల్యం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురొడ్డి.. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అన్నామలై ఎంతగానో కృషి చేశారు. అయితే ఇన్నాళ్లు ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన అన్నామలైకు.. ఎన్నికల్లో అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తుపెట్టుకొని గట్టి షాక్ ఇచ్చింది. పళనిస్వామి పట్టుబట్టడంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి నుంచి సైతం ఆయన్ను తొలగించింది.

ANN TOP 10