భారత్-నేపాల్ మధ్య చాలాకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం మరోసారి భగ్గుమంది. భారత్ తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తున్న నేపాల్… తాము కూడా భారత భూభాగాలను కొన్నిచోట్ల ఆక్రమించామని ఆ దేశ ప్రధాని బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగగా, గంటల వ్యవధిలోనే ప్రభుత్వం వివరణ ఇచ్చి నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఈ ఏడాది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రసంగించిన 35 ఏళ్ల బాలెన్ షా, సరిహద్దు వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని అయ్యాక నాకు తెలిసిన ఓ వాస్తవం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా చాలా చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. ఇప్పుడు రెండు దేశాలు స్నేహితుల్లా కూర్చొని, వాస్తవాలను అధ్యయనం చేసి సమస్యను పరిష్కరించుకోవాలి” అని ఆయన అన్నారు. ఇందుకోసం చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని చైనా, యూకే దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన తెలిపారు.
సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత
ప్రధాని వ్యాఖ్యలతో నేపాల్ పార్లమెంటులో వెంటనే గందరగోళం చెలరేగింది. సొంత దేశమే భారత భూభాగాన్ని ఆక్రమించిందని ప్రధాని ఎలా అంటారని ప్రతిపక్ష నేపాలి కాంగ్రెస్, నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధాని తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని లేదా వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలీ సైతం ప్రధాని క్షమాపణ చెప్పాలని కోరారు.
మరోవైపు నేపాల్ మాజీ దౌత్యాధికారులు, సరిహద్దు నిపుణులు కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు. నేపాల్ ఎన్నడూ భారత భూభాగాన్ని ఆక్రమించలేదని సరిహద్దు నిపుణుడు బుద్ధి నారాయణ్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు స్తంభాలు లేకపోవడంతో ఇరువైపుల రైతులు పరస్పరం భూములను వాడుకుంటున్నారని, అంతేకానీ దీనిని ఆక్రమణ అనలేమని అన్నారు. ప్రధానికి ఈ విషయంపై పూర్తి సమాచారం లేదని, భారత్ కూడా ఈ అంశాన్ని అధికారికంగా ఎప్పుడూ లేవనెత్తలేదని మాజీ రాయబారులు అభిప్రాయపడ్డారు.
వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ
వివాదం ముదరడంతో నేపాల్ విదేశాంగ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ప్రధాని వ్యాఖ్యలు ‘నో-మ్యాన్స్ ల్యాండ్’, ‘సరిహద్దుల్లో పరస్పర భూ వినియోగం’ గురించేనని, అధికారిక ఆక్రమణల గురించి కాదని స్పష్టం చేసింది. సరిహద్దు స్తంభాల నిర్మాణం, దస్గజ (నిర్వహణ కోసం సరిహద్దు వెంబడి ఉండే స్ట్రిప్) ప్రాంతాలపై సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపింది.
లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలపై ఇరు దేశాల మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తుండగా, అవి ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ స్పష్టం చేస్తోంది. 2021లో అప్పటి ఓలీ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేయగా, భారత్ దానిని ఏకపక్ష చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించింది. ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర లిపులేఖ్ మీదుగా జరగడాన్ని కూడా నేపాల్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు మరోసారి చర్చను రాజేశాయి.








