AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!

గండిపేట భూ కబ్జా కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ జీవోలు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించటానికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు 4కోట్ల రూపాయలను రాధాకృష్ణ అనే మరో నిందితునికి ఇచ్చినట్టుగా దర్యాప్తులో వెల్లడైంది. కాగా, కేసులు నమోదు కాగానే పారిపోయిన రాధాకృష్ణ (53)తోపాటు అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ (34)ను తాజాగా నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో కటకటాల వెనక్కి వెళ్లిన నిందితుల సంఖ్య అయిదుకు చేరింది. శేరిలింగంపల్లి జోన్ డీసీపీ సీ.హెచ్.శ్రీనివాస్, సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

 

కీలక నిందితుడు..

గండిపేట గ్రామంలో సర్వే నెంబర్ 18లోని పదిహేను వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ పోరంబోకు భూమిని కబ్జా చేయటానికి కొంతమంది ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీని కోసం నిందితులు ఏకంగా ఫోర్జరీ చేసిన ప్రభుత్వ జీవోలు, ఇతర డాక్యుమెంట్లను సృష్టించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా చూసిన గండిపేట మండలం తహసిల్దార్ దీనిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే గండిపేట గ్రామానికి చెందిన నిమ్మల రాజేశ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ ను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు మరికొందరికి కూడా దీంట్లో సంబంధం ఉందని వెల్లడైంది. ఈ క్రమంలో పరారీలో ఉన్న వారి కోసం గాలింపును ముమ్మరం చేసిన నార్సింగి పోలీసులు తాజాగా కీలక నిందితుడు రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్ కుమార్ లను అరెస్ట్ చేశారు.

 

ఆ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా..

విచారణలో రాధాకృష్ణ గతంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ విభాగంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేశాడు. ఆ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధానాల గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి అక్రమాలకు తెర లేపాడు. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, భూ క్రమబద్దీకరణ ఉత్తర్వులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వ ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ అనుమతులు సైతం ఇప్పటిస్తానని నమ్మిస్తూ జనాన్ని మోసం చేయటం మొదలు పెట్టాడు. సెక్రటేరియట్ లో తాను డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నానని చెప్పి 2013లో కరీంనగర్ కు చెందిన పలువురు యువకుల నుంచి 30లక్షల రూపాయలు కొల్లగొట్టాడు. ఈ మేరకు కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ లో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తరువాత కూడా మోసాలు సాగిస్తూ వచ్చిన రాధాకృష్ణపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు రిజిష్టరయ్యాయి.

 

మరింత సంపాదించాలని..

ఇలా ఉద్యోగాల పేర మోసాలు చేసి కొల్లగొట్టిన డబ్బుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డ రాధాకృష్ణ మరింతగా సంపాదించటానికి భూములకు సంబంధించిన మోసాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతనికి గండిపేటలోని ప్రభుత్వ పోరంబోకు భూమి తమది అని చెప్పుకొన్న వారితో పరిచయం ఏర్పడింది. అదే సమయంలో ఈ భూమిని కొనాలనుకున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, అతని సోదరుడు బొల్లా రమేశ్ లతో కూడా పరిచయం చేసుకున్నాడు. అవసరమైన అన్ని డాక్యుమెంట్ల తాను తయారు చేసి ఇస్తానని వారికి చెప్పాడు. దాంతో బొల్లా బ్రహ్మనాయుడు అతనికి 4కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత రాధాకృష్ణ ఓ న్యాయవాది సాయంతో నకిలీ జీవోలు, తప్పుడు సీసీఎల్ఏ ప్రొసీడింగ్స్, నకిలీ ఎన్వోసీలు, అధికారిక లేఖలు, ఇతర ప్రభుత్వ పత్రాలను సృష్టించాడు. వీటిపై సీనియర్ ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.

 

కేసులు నమోదు..

ఈ క్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు నుంచి సదరు న్యాయవాదికి మరో 4కోట్ల రూపాయలు ఇప్పించాడు. విచారణలో కొవ్వూరు సునీల్, కరణం రాజేష్, ప్రవీణ్ కుమార్, ప్రభుదాస్ లు రాధాకృష్ణకు సహకరించినట్లు తేలింది. కేసులు నమోదు కాగానే రాధాకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా ప్రవీణ్ కుమార్ ఫోర్జరీ ద్వారా సృష్టించిన డాక్యుమెంట్లను దాచి పెట్టాడు. పోలీసుల కదలికల గురించి ఎప్పటికప్పుడు రాదాకృష్ణకు సమాచారం ఇస్తూ వచ్చాడు. అయితే, సాంకేతిక ఆధారాలతో పక్కాగా సమాచారాన్ని సేకరించిన పోలీసులు రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి కొన్ని ఒరిజినల్ జీవోలతోపాటు ఫోర్జరీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీలు, 5 ల్యాప్ టాప్ లు, 12 చెక్‌ బుక్కులు, 13 ఫోర్జరీ స్టాంపులు, 7బ్యాంక్ పాస్ బుక్కులు, 10 ఏటీఎం కార్డులు, వేర్వేరు భూములకు చెందిన 31 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.

ANN TOP 10