AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మంలో తొలి మహిళా సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం..!

తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన వారంరోజుల మహిళా వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసం, బాలికల అభివృద్ధి, మహిళా భద్రత, పారిశ్రామిక ప్రోత్సాహం వంటి అంశాల చుట్టూ సాగి మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొని మహిళల్లో స్ఫూర్తినింపారు.

 

ఇందిరా మహిళా శక్తి భవనాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ వారోత్సవాలు మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి, యువతుల్లో నాయకత్వ లక్షణాల పెంపు వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాయి. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వారంరోజుల పాటు వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వారోత్సవాల ప్రారంభ రోజున రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇందిరా మహిళా శక్తి భవనాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్య కార్యాలయాలు, వర్క్‌షెడ్లు, గోదాముల నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపనలు నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదే సందర్భంగా మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిలుకపచ్చ రంగు యూనిఫాం చీరలను ఆవిష్కరించారు.

 

శిక్షణా శిబిరాలు..

వారోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కార్యక్రమం ఖమ్మం జిల్లా మధిరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మహిళలు సంప్రదాయ జీవనోపాధి రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా పునరుత్పాదక ఇంధన రంగాల్లోనూ విజయవంతంగా అడుగుపెట్టగలరనే సందేశాన్ని ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి అందించింది. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా POSH చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. అదే సమయంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం “బాల్య వివాహం – బతుకు ఆగం” పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి సమాజంలో విస్తృత చైతన్యం కల్పించారు.

 

ప్రత్యేక కార్యక్రమాలు

మహిళలను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో వ్యాపార దృక్పథాన్ని పెంపొందించే దిశగా రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ “బలమైన బాల్యానికి 1000 మెట్లు” కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. చిన్నారి జీవితంలోని తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

 

టీనేజ్ బాలికల్లో..

వారోత్సవాల ముగింపు రోజున నిర్వహించిన “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమం విశేష స్పందన పొందింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు యూనిఫారాల పంపిణీ, ప్రీ-స్కూల్ విద్య పూర్తి చేసిన చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాల అందజేత, “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాల ప్రదానం వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీనేజ్ బాలికల్లో మొబిలిటీ ని పెంచేందుకు, భవిష్యత్తులో బైక్ నేర్చుకునేందుకు వీలుగా సైకిల్ తొక్కడం నేర్పించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించిన స్నేహ సంఘాల బాలికల మాక్ పార్లమెంట్ కార్యక్రమాలు యువతుల్లో నాయకత్వ సామర్థ్యాలను వెలికితీసే వేదికగా నిలిచాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించడంతో పాటు నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల పాత్ర ఎంత కీలకమో బాలికలకు ఈ కార్యక్రమాలు తెలియజేశాయి.

 

ప్రభుత్వం సిద్ధం..

వారంరోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్నేహ సంఘాల బాలికలు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పారిశ్రామికవేత్తలు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములయ్యారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరగడం, మహిళల్లో వ్యాపార ఆలోచనలు బలోపేతం కావడం, నాయకత్వ లక్షణాలు పెంపొందడం, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన విస్తరించడం వంటి సానుకూల ఫలితాలు ఈ వారోత్సవాల ద్వారా కనిపించాయి. మహిళా సాధికారతను ఉద్యమంగా మలచాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించగా, మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మహిళా వారోత్సవాలను విజయవంతం చేసిన స్వయం సహాయక సంఘాలు, స్నేహ సంఘాలు, అంగన్వాడీ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత మరియు ప్రజలందరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.

 

ప్రజా ఉద్యమంగా మహిళా వారోత్సవాలు నిలిచాయి – మంత్రి సీతక్క

మహిళా వారోత్సవాల విజయంపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ వారోత్సవాలు బలమైన పునాది వేశాయని ఆమె పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం సాకారం అయ్యే దిశగా మహిళల్లో కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు ఈ కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

 

భవిష్యత్తులో..

గ్రామీణ మహిళలు వ్యవసాయం, సూక్ష్మ వ్యాపారాలకే పరిమితం కాకుండా పారిశ్రామిక రంగం, విద్యుత్ ఉత్పత్తి, సేవారంగం, నాయకత్వ స్థానాల్లోనూ రాణించగలరని ఈ వారోత్సవాలు నిరూపించాయని ఆమె అన్నారు. మహిళలు బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని, తెలంగాణ మహిళలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

ANN TOP 10