కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. కేసు నమోదై మూడు రోజులు గడిచినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నినాదాలు చేస్తూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజీనామా చేయాలని డిమాండ్..
మంత్రి కుమారుడు కావడంతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.








