మనందరి మొదటి శత్రువు బీజేపీయేనని, కాబట్టి అందరం కలిసి ఆ పార్టీపై పోరాటం చేద్దామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సువేందు అధికారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలని సూచించారు.
విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా మద్దతివ్వాలని కోరారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాలు, ప్రతిపక్షాలతో పాటు జాతీయ పార్టీలు కూడా కమలం పార్టీపై పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అని ఆలోచించే సమయం ఇది కాదని అన్నారు. మనందరి మొదటి శత్రువు బీజేపీయే అన్నారు. బీజేపీ వంటి దుష్ట శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని విమర్శించారు.
తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు తనతో మాట్లాడారని వెల్లడించారు. తాను ఎవరి సానుభూతిని కోరుకోవడం లేదని, యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పార్టీకి అన్యాయం జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు.







