AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్‌పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. కేసు నమోదు..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. నిన్న వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారంటూ ‘రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావ్?’ అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

 

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, జాతీయ స్థాయి నాయకుడిని ఉద్దేశించి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలకు దిగారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఎమ్మెల్యే ఫిర్యాదును స్వీకరించిన సుబేదారి పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, అనుచిత పదజాలంతో దూషించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

ఈ పరిణామం అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మార్చింది. ఇప్పటికే ధరణి, రైతు రుణమాఫీ వంటి అంశాలపై ఇరు పార్టీలు కత్తులు నూరుతుండగా, ఇప్పుడు ఈ క్రిమినల్ కేసు రాజకీయ వేడిని మరింత పెంచింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

ANN TOP 10