ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ల తయారీ సంస్థ క్యారియర్ తన నూతన ప్లాంట్‌కు శ్రీకారం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టుకు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ అడుగు పడినట్లు కనిపిస్తోంది.
అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ దాదాపు రూ. 1000 కోట్ల భారీ పెట్టుబడితో ఇక్కడ తన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీసిటీలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ రూపు దిద్దుకోనుంది. ముఖ్యంగా గృహేతర అవసరాలకు ఉపయోగపడే భారీ స్థాయి ఏసీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలవుతాయి.
ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం ఉపాధి కల్పన. సుమారు 3000 మందికి ఈ పరిశ్రమ ద్వారా పని లభిస్తుందని అంచనా. ఇందులో 1000 మందికి నేరుగా, మరో 2000 మందికి అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగు పరిచేందుకు.. కొత్త కంపెనీలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఈ క్యారియర్ పరిశ్రమ రాక ఒక నిదర్శనమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో శ్రీనిటీ మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉంది.








