రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిందని మంత్రి వెల్లడించారు. మొత్తం 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.84 లక్షల మంది రైతుల నుండి ఈ సేకరణ జరిగిందని.. ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. 2001.96 కోట్లు జమ చేశామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన సంఖ్యలో తార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం వెంటనే పార్బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం ఎక్కువగా వచ్చే నల్గొండ.. నిజామాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. రవాణాలో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆయన హుకుం జారీ చేశారు.
వర్షాల ప్రభావంపై సమీక్షించిన మంత్రి.. నల్గొండ జిల్లాలో గాలివాన కారణంగా సుమారు 299 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్న మంత్రి.. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ధాన్యం నిల్వ కోసం రాష్ట్రంలో 16 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను సిద్ధం చేశామని.. పౌరసరఫరాల శాఖ వద్ద 18.5 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొనుగోళ్లపై సమగ్ర నివేదికను సమర్పించారు. పార్బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటికే 16.8 లక్షల మెట్రిక్ టన్నుల కోటాను కేటాయించామని.. అవసరమైతే అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని.. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








