సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో 15-20 రోజులుగా రైతులు వడ్ల కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని డైలాగులు కొట్టడం మానేసి.. కల్లాల వద్దకు వచ్చి రైతుల గోస చూడాలని డిమాండ్ చేశారు. రైతు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి దొంగ రైతు బిడ్డ అని, రుణమాఫీ చేయకుండా దేవుని మీద ఒట్టు పెట్టి రైతులను వంచించారని ధ్వజమెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ప్రభుత్వం ఇప్పటివరకు పది పైసల వడ్లు కూడా కొనలేదని హరీశ్ రావు విమర్శించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు అవగాహనే లేదని, ఏ జిల్లాలోనూ మంత్రులు కొనుగోలు కేంద్రాల వైపు చూడటం లేదని ఆరోపించారు. జీపీఎస్, ఆన్‌లైన్ పేరిట రైతులను చిత్రహింసలు పెడుతున్నారని.. ఊళ్లోనే రైస్ మిల్లు ఉంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లులకు పంపాలని నిబంధనలు పెట్టడం వల్ల రైతులకు రవాణా ఖర్చులు, సమయం వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ వంటి జిల్లాల్లో తాలు పేరిట క్వింటాల్ కు 4-5 కిలోల తరుగు తీస్తున్నారని, తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరి తోలు తీస్తాడో చెప్పాలని ప్రశ్నించారు.
కేవలం ధాన్యం మాత్రమే కాకుండా శనగలు, సన్ ఫ్లవర్, మొక్కజొన్న పండించిన రైతులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో శనగలు పండితే సగం కూడా కొనకుండా కేంద్రాలు బంద్ పెట్టారని విమర్శించారు. మద్దతు ధర రూ. 3,371 ఉన్న జొన్నల కొనుగోలు కేంద్రాలే ప్రారంభించలేదని.. దీంతో రైతులు రూ. 2500 కే ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్న విషయంలో కూడా ఎకరాకు 26 క్వింటాళ్లే కొంటామనే కొత్త నిబంధనలు తెచ్చి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టారని మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకగా హరీశ్ రావు అల్టిమేటం జారీ చేశారు. మూడు, నాలుగు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని, కలెక్టరేట్ల ముందు వంటావార్పు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో షరతులు లేకుండా ఎంత పంట పండితే అంత కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు.








