AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుకు మెగలోమేనియా అనే వ్యాధి ఉంది.. భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నూతన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దారుణమైనవిగా అభివర్ణించారు. వైసీపీని “హంతకుల పార్టీ.. గొడ్డలి పార్టీ..” అని విమర్శించడం తగదని, రాజకీయాల్లో హింసకు, కుల రాజకీయాలకు చంద్రబాబు తన విద్యార్థి దశలోనే నాంది పలికారని భూమన ఆరోపించారు. వైసీపీ నాయకులను మానసిక వ్యాధిగ్రస్తులుగా చిత్రీకరించడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

 

చంద్రబాబు మానసిక స్థితిపై స్పందిస్తూ.. ఆయనకు మెగలోమేనియా (అహంభావ వ్యాధి) ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. వేదాలను వ్యాసుడు రాయలేదని, తానే రాశానని, భగవద్గీతను శ్రీకృష్ణుడి కన్నా తానే బాగా చెప్పగలనన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యెల్లో మీడియా ఆయన వ్యాఖ్యలకు వత్తాసు పలుకుతోందని, గతంలో చంద్రబాబు చేసిన హత్య, రౌడీ రాజకీయాలను మసిపూసి మారేడు కాయ చేసే శక్తి ఆయన మీడియాకు ఉందని విమర్శించారు. ఎన్డీఏ కూటమి పాలనలో ఇప్పటివరకు 750 మందికి పైగా హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

టీటీడీ ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం విఫలమైందని భూమన ఆరోపించారు. రూ. 3,000 కోట్ల విలువైన టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖ ద్వారా ఒబెరాయ్ హోటల్‌కు కేటాయించడం సిగ్గుచేటు అని అన్నారు. అలాగే రూ. 650 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని బినామీ సంస్థ దివ్యశ్రీకి కేవలం రూ. 20 కోట్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. అమ్మవారి ఆలయం సమీపంలో ‘స్పాలు’ ఏర్పాటు చేయాలని చూడటం ఆధ్యాత్మికతను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎన్డీఏ నాయకులు సర్వం దోచేస్తున్నారని ఆరోపించారు.

 

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని, అమ్మను, చెల్లిని.. ఎవరినైనా ఉపయోగిస్తారని భూమన విమర్శించారు. మామ, తమ్ముడు, తోడల్లుడు, బామ్మర్ది వంటి కుటుంబ సభ్యులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదని, కేవలం మేనేజ్‌మెంట్ ద్వారానే అధికారంలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, ఈ రెండేళ్లలో జరిగిన ఘాతుకాలకు 2029 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ నేతలు, సోషల్ మీడియా వారియర్లపై అక్రమ కేసులు పెట్టి వేధించడం మానుకోవాలని భూమన హితవు పలికారు.

ANN TOP 10