ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురై అదనంగా కొనుగోలు చేయడం వల్లే బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరతపై మంత్రి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంధనాన్ని అక్రమంగా దారి మళ్లించే వారిపై, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ లేదని చెప్పి ‘నో స్టాక్’ బోర్డులు పెట్టే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఇంధనం అందేలా బంకుల్లో రేషన్ పద్ధతిని (పరిమితంగా పోయడం) కొనసాగించాలని ఆదేశించారు. గత రెండు రోజులతో పోలిస్తే బంకుల మూసివేత తగ్గిందని, ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా క్రమంగా పెరుగుతోందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఆక్వా, వరి రైతులకు అవసరమైన డీజిల్ కొరత రాకుండా చూడాలని అధికారులను కోరారు.
సోషల్ మీడియాలో ఇంధన కొరతపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1967 కు అందుతున్న ఫిర్యాదులపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. బంకుల వద్ద ఇంధనం ఉన్నా ఇవ్వడం లేదని లేదా కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి టాస్క్‌ఫోర్స్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని ఆయన భరోసా ఇచ్చారు.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం ఇసుక ర్యాంపులో అక్రమ డీజిల్ దందాను రెవెన్యూ అధికారులు రట్టు చేశారు. స్థానికుల సమాచారంతో ట్యాంకర్ నుండి డ్రమ్ముల్లోకి డీజిల్ నింపుతుండగా దాడులు నిర్వహించి 29 వేల లీటర్ల డీజిల్, లారీ, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. సామర్లకోట నుండి పారిశ్రామిక అవసరాల కోసం తెచ్చామని యజమానులు చెబుతున్నా.. సరైన బిల్లులు లేకపోవడంతో అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









