AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినీ లవర్స్ కి షాక్.. మే 1 నుంచి థియేటర్లు బంద్..!

సాధారణంగా సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల్ని మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి తమకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక సమ్మర్ సెలవులు వచ్చాయంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారంలో కనీసం 2,3 సినిమాలు అయినా చూడాల్సిందే అనే రేంజ్ లో కొంతమంది సినీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా మూవీ లవర్స్ కి షాక్ ఇస్తూ మే 1వ తేదీ నుంచి థియేటర్లను బందు చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.అంతేకాదు ఈ విషయం సినిమా లవర్స్ కి భారీ షాక్ కలిగించిందని చెప్పవచ్చు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 

మే ఒకటి నుంచి థియేటర్ల బంద్..

అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ సినిమా థియేటర్ వ్యవస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్న వేళ ఎగ్జిబిటర్లు తీసుకున్న సంచలన నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . రెంటల్ పద్ధతి వల్ల తాము విపరీతంగా నష్టపోతున్నామని.. దాని స్థానంలో పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి థియేటర్ల బందుకు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ ల తాకిడి , ఓటీటీల ప్రభావం సింగిల్ స్క్రీన్ పై పడటంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. అందుకే థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ పర్సెంటేజీ విధానాన్ని కోరుతున్నారు.

 

ఎగ్జిబిటర్ల కష్టాలు తీరేనా?

ఇకపోతే తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో మెజారిటీ సింగిల్ స్క్రీన్లు రెంటల్ లేదా ఫిక్స్డ్ అమౌంట్ ప్రాతిపదకన నడుస్తున్నాయి. అంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా థియేటర్ యజమాని డిస్ట్రిబ్యూటర్లకు ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయితే థియేటర్ యజమాని.. చెప్పిన అమౌంట్ కట్టేసినా.. కలెక్షన్స్ లేదా సొంత జేబు నుంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. అదే మల్టీప్లెక్స్ ల విషయానికి వస్తే.. పర్సంటేజీ విధానం అమలులో ఉంది. అంటే వచ్చిన వసూళ్లలో థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ఒప్పందం ప్రకారమే వాటాలను పంచుకుంటారు. అందుకే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కి ఇటు థియేటర్ యాజమాన్యానికి నష్టం ఉండదు. కాబట్టి ఇదే విధానాన్ని సింగిల్ స్క్రీన్ లలో కూడా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు.

 

కష్టమైన తుది తీర్పు వస్తుందా?.

అంతేకాదు థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రతి సినిమా కనీసం 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదు అనేలా ఓటీటీ విండో విధిస్తే అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ముఖ్యంగా టికెట్ ధరల నియంత్రణ విద్యుత్ చార్జీలపై సబ్సిడీ సహా పన్నుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మొత్తానికైతే ఎగ్జిబిటర్లు కోరుతున్న ఈ అంశాలన్నింటిపై ఈనెల 30లోపు స్పష్టమైన నిర్ణయం వస్తే థియేటర్లు మళ్ళీ యధావిధిగా కళకళలాడుతాయి. ఒకవేళ స్పష్టమైన నిర్ణయం రాకపోతే మాత్రం మే ఒకటి నుంచి తెలంగాణలో ఉన్న సుమారు 450 కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హెచ్చరించింది. ఏది ఏమైనా ఈ వేసవి సమయంలో సినిమాలు చూసి ఫ్యామిలీతో చిల్ అవుదాం అనుకున్న సినీ లవర్స్ కి ఇది భారీ షాక్ అనే చెప్పాలి. అటు ఈ బంద్ నిర్ణయం చిత్ర పరిశ్రమకు కూడా షాక్ కలిగిస్తోంది. మరి సినీ పెద్దలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ANN TOP 10