AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ సినిమాలో రాజీవ్ కనకాల..?

రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు. నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన హీరోగా కాకపోయినా కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న రాజీవ్ కనకాల త్వరలోనే గోదారి గట్టుపై సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన తదుపరి సినిమాల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమాలో రాజీవ్ కనకాల(Rajeev Kanakala) నటించాల్సిందే.

 

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన ప్రయాణం..

వీరిద్దరూ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా వెండితెరపై సందడి చేశారు. ఈ సినిమా సమయం నుంచి ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతి ఒక్క సినిమాలో కూడా రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో రాజీవ్ నటించని సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. తాజాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి వెండి తెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

 

ఎన్టీఆర్ సినిమాలో రాజీవ్ కనకాల..

ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమాలో కూడా రాజీవ్ కనకాల చిన్న పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి ఎన్టీఆర్ రాజీవ్ కనకాల కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయం గురించి గోదారి గట్టుపై సినిమా ఈవెంట్లో రాజీవ్ కనకాలకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తాను ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.

 

2027 జూన్ 11న విడుదల..

 

చాలా సంవత్సరాలు తర్వాత తిరిగి ఎన్టీఆర్ తో తాను సినిమా చేస్తున్నానని, ఈ సినిమాకు ఇంతకుమించి మరే విషయాలు చెప్పలేనని రాజీవ్ కనకాల తెలియచేశారు. అయితే ఈయన మే 7వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక రాజీవ్ కనకాల పాత్రకు సంబంధించి చిత్ర బృందం అధికారకంగా తెలియచేయాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇక మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రాబోతుందని తెలుస్తోంది.

ANN TOP 10