AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క‌విత‌ కొత్త పార్టీపై కేటీఆర్ కీల‌క‌ వ్యాఖ్య‌లు..

క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌క‌టించిన‌ కొత్త పార్టీపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కవిత ‘టీఆర్‌ఎస్‌’ (TRS) పేరుతో కొత్త పార్టీని స్థాపించడంపై స్పందిస్తూ రాజకీయాల్లో చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజకీయ పార్టీలు చాలా తక్కువని, ఈ కొత్త పార్టీని తాము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ కొట్టిపారేశారు. కేసీఆర్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తేజస్వి సూర్య మాట్లాడుతున్న సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అతడిని నిలదీసి క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు.

 

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశామని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు, సబ్బండ వర్గాలకు మరియు సకల జనులకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ ఈ సమావేశంలో వివరించారని, కేవలం తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల విశిష్టతను గుర్తు చేస్తూ రైతుబంధు వంటి పథకాలను ఐక్యరాజ్యసమితి (UN) సైతం ప్రశంసించిందని కేటీఆర్ గుర్తుచేశారు. రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలని, బీఆర్ఎస్ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయంగా ఎన్ని శక్తులు ఎదురైనా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10