బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సింగరేణి సంస్థను, కార్మికుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో కార్మికుల నియామకాలపై ఎంక్వైరీ చేస్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. కార్మికుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, కఠిన పరిస్థితుల్లో బొగ్గును వెలికితీస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతున్నారని కవిత కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో సుమారు 20 వేల మంది వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు వాటిపై విచారణ జరపాలనుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. విచారణలు చేయాల్సింది కార్మికులపై కాదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న డీజిల్ కుంభకోణాలు, అవినీతిపై అని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సింగరేణికి సుమారు రూ. 47 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని విడుదల చేయకపోవడంతో కార్మికుల భద్రత, జీతాలకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో లిథియం రిఫైనరీ పేరుతో కేవలం రూ. 27 లక్షల టర్నోవర్ ఉన్న ‘అల్ట్ మిన్’ అనే చిన్న సంస్థతో రూ. 2250 కోట్ల ఒప్పందం చేసుకోవడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని విమర్శించారు. రాజస్థాన్ సోలార్ ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందని, వీటిపై తాము లేఖ రాస్తామని తెలిపారు.
కార్మికుల సంక్షేమం కోసం వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే గని కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, వైద్య సేవల విషయంలో నిమ్స్ రేట్ల కంటే మెరుగైన సీజీహెచ్‌ఎస్ రేట్లను వర్తింపజేయాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరిగితే తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని, హెచ్‌ఎంఎస్ (HMS) చేసే ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.








