మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ (DTF) జరిపిన ఈ ఆపరేషన్‌లో సుమారు 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ (హైబ్రీడ్ గంజాయి) స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి ఇంజోత్ సింగ్ నగపాల్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును కూడా సీజ్ చేశారు.
పోలీసుల విచారణలో ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి. ముంబైలోని ఒక నైజీరియన్ వ్యక్తి ద్వారా కొకైన్‌ను, థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చెందిన వ్యక్తి నుంచి ఓజీ కుష్‌ను నిందితుడు సేకరించినట్లు గుర్తించారు. వీరు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, అత్యంత రహస్యంగా వ్యవహరించేవారు. ముఖ్యంగా ఎవరికీ అనుమానం రాకుండా నిర్దేశిత ప్రదేశాల్లో డ్రగ్స్ దాచి ఉంచే “డెడ్ డ్రాప్స్” పద్ధతిని వీరు అనుసరించినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన నిందితుడు ఇంజోత్ సింగ్‌కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌లో పరారీలో ఉన్న విదేశీయుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ముఠాకు నగరంలో ఉన్న కస్టమర్లు ఎవరు? ఇంకా ఎవరెవరు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారు? అనే కోణంలో కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విదేశీ కనెక్షన్లు ఉండటంతో ఈ కేసు ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.








